Monday, July 16, 2007

నా మొదటి బ్లాగ్ కి శ్రీ కారం చుడుతూ - ఎవరినైనా తిట్టాలని కాదు కానీ, కొన్ని విషయాలు పంచుకోకుండా వుండలేక పోతున్నాను.
ఒక ప్రముఖ తెలుగు టీవీ చానెల్ వారికి, వ్యాపారానికి సంబంధిచిన 'ఎథిక్శ్' అంటే 'ఆచారాలూ లేక మర్యాదలూ అనేవి పాటించాలి అన్న ఇంగితం వున్నదా లేదా అని అనుమానం వస్తున్నది. ఎంత కమర్షియలిజంలో కొట్టుకు పోతుంటే మాత్రం, ప్రతి పది నిముషాలకీ ఒక సారి నాలుగేసి నిముషాలసేపు ఎడ్వర్టైజ్మెంట్లా? అది సీరియల్ కానివ్వండి, వార్తలు కానివ్వండి, మరోటేదైనా కానివ్వండి, ఈ పది-నాలుగు ఈక్వేషన్ మాత్రం అలా సాగిపోతూ వుండాల్సిందేనన్న మాట! ఔరా!!
ఆ మధ్య మనందరం తెలుసుకున్నాం, ప్రమాదాల్లో మరణించిన వారి శవాలనూ, ఘోర-భీభత్స దృశ్యాలనూ టీవీ చానెళ్ళలో చూపరాదని ప్రభుత్వం వారి ఆదేశం ఒకటి వెలువడిందని. కానీ ఆ ఆదేశాన్ని ఖాతరు చేస్తున్న దాఖలాలింతవరకూ నాకు మాత్రం దొరకలేదు. పైగా, ప్రత్యేకించి, ఆ ఘోరాలనే తరచి తరచి, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలుగా చూపించడం చేస్తున్నారు. ఇది ఎంత వరకూ సమంజసం? అది ప్రభుత్వాదేశాలను కించపరచడం కాదా?
ఈ విషయం, ఈ రకమైన "ఆదేశ ధిక్కార నేరాల" మీద చర్య తీసుకోవాల్సినటువంటి పెద్దలకు తెలియదనుకోను.
ఇక పోతే, వార్థాపత్రికలు నిష్పక్షపాతంగా సమాచారాన్ని అందించి, సమాజాభ్యుదయానికి తమ వంతు చేయూత అందిస్తూ వుంటాయని నమ్మడం,బహుశా ఈ రోజుల్లో అమాయకత్వమేనేమో!
తర్వాత, భారతదేశంలో అత్యధికంగా మాట్లాడబడే తెలుగు భాషని, రకరకాలుగా హత్య చేయడం కూడా వీరికే చెల్లింది.
వీరికి నైతిక బాధ్యత లేదా?
కేవలం డబ్బు సంపాదన తప్ప వేరే విలువలు లేవా?
నేనిలా మాట్లాడే మొదటి వాడిని కాదని నాకు తెలుసు. ఇదే పని మరెందరో చేస్తున్నారనీ తెలుసు. కానీ "ప్రపంచాగ్నికి సమిధ"లాంటిదేదో అర్పిస్తున్నానన్న తృప్తికోసం,
ఈ చిన్న విన్నపం.
మీరేమంటారు?
ఎస్. ఆర్. బందా